ఆస్ట్రేలియా తమ జాతీయ జెండాను కాపీ కొడుతుంది అని ఆరోపించిన న్యూజిలాండ్

వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియా తమ జాతీయ జెండాను కాపీ కొడుతున్నదని న్యూజిలాండ్ తాత్కాలిక ప్రధాని విన్ స్టన్ పీటర్స్ ఆరోపించారు. ఈ నేపధ్యంలో సొంతంగా మీ జెండాను మీరు రూపొందించుకోండి అని ఆయన పొరుగు దేశానికి సూచించారు. మాకు చాలా రోజులుగా జాతీయ పతాకం ఉంది.. దానిని ఆస్ట్రేలియా కాపీ కొట్టింది అని ఆయన విమర్శించారు. ఈ డిజైన్‌తో తాము ముందుగా పతాకాన్ని తయారుచేశామని, అందుకే ఆస్ట్రేలియానే మరో డిజైన్ చూసుకోవాలని పీటర్స్ స్పష్టంచేశారు. మెటర్నిటీ లీవ్‌లో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ స్థానంలో పీటర్స్ తాత్కాలిక ప్రధానిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి పీటర్స్ చెబుతున్నట్లుగా రెండు దేశాల పతకాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఈ రెండు దేశాల జెండాల్లో యునైటెడ్ కింగ్‌డమ్ యూనియన్ ఫ్లాంగ్‌తోపాటు పక్కనే నక్షత్రాలు ఉంటాయి. ఆస్ట్రేలియా జాతీయ పతాకం కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే వాళ్ల జెండాలో నక్షత్రాలు ఎరుపు రంగులో కాకుండా తెలుపు రంగులో ఉంటాయి. ఇక ఆస్ట్రేలియాలోని రాష్ర్టాలు, ప్రాంతాలను సూచించేలా ఏడు పాయింట్లతో కూడిన ఓ అదనపు నక్షత్రం కూడా ఉంటుంది. న్యూజిలాండ్ జాతీయ పతాకాన్ని 1902లో ఆమోదించగా.. ఆస్ట్రేలియా ప్రస్తుత జెండా 1954లో వచ్చింది.