అమెరికాలో హైదరాబాద్‌ యువకుడి అదృశ్యం

వాస్తవం ప్రతినిధి:అమెరికాలో ఎంఎస్ చదువుతోన్న హైదరాబాద్ కు చెందిన మీర్జా అహ్మద్ అలీ బేగ్ జాడ తెలియడంలేదు. రెండు రోజుల నుంచి ఫోన్ స్విఛ్చాఫ్ వస్తోందని తమ కుమారుడి నుంచి ఎలాంటి సమాచారం లేదని బేగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళన చెందుతున్నారు. 2015లో అమెరికాకు వెళ్లిన బేగ్ న్యూయర్క్ లో ఎంఎస్ చేస్తూ స్థానికంగా ఉన్న మొబైల్ స్టోర్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. గత శుక్రవారం చివరిసారిగా ఫోన్‌లో తల్లితో భయపడుతూ మాట్లాడి, తన తమ్ముడితో మాట్లాడాలని చెప్పినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఆ సమయంలో తాను ఇంట్లో లేనని, తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదని మీర్జా అహ్మద్‌ సోదరుడు మీర్జా షుజాత్‌ తెలిపాడు. తర్వాత మళ్లీ చేస్తే ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చిందని చెప్పాడు. ఎయిరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తయిన తర్వాత పెన్సిల్‌వీనియాలోని గన్నాన్‌ విశ్వవిద్యాలయంలో ఎయిరోనాటికల్‌ విభాగంలో ఎంఎస్‌ చేయడానికి వెళ్లాడు. కొన్ని కారణాల వల్ల తిరిగి న్యూజెర్సీలోని అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ టెక్నాలజీలో చేరాడు. విద్యను అభ్యసిస్తూనే న్యూయార్క్‌లోని ఓ మొబైల్‌ స్టోర్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేసేవాడు. అమెరికాకు వెళ్లిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అతను హైదరాబాద్‌ రాలేదని కుటుంబ సభ్యులు చెప్పారు.