వేడి గాలుల వల్ల మూడు రోజులకు కుదించిన ప్రాక్టీస్ మ్యాచ్ లు

వాస్తవం ప్రతినిధి: ఆగస్టు 1 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ఎసెక్స్‌ జట్టుతో నాలుగు రోజుల మ్యాచ్ ను ఆడాల్సి ఉంది. అయితే అక్కడ విపరీతమైన వేడి గాలులు కారణంగా టీమ్‌ఇండియా ఆడాల్సిన నాలుగు రోజుల మ్యాచ్‌ను మూడు రోజులకు కుదించనున్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్‌ ముందు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం బుధవారం మొదలు కావాల్సి ఉండగా.. గురువారం ఆటను ఆరంభించాలని నిర్ణయించారు. భారత ఆటగాళ్లు మంగళవారం ఇదే మైదానంలో నెట్‌ ప్రాక్టీస్‌ చేశారు. ఆ సందర్భంగా వేడి గాలులు ఆటగాళ్లను ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలోనే కోచ్‌ రవిశాస్త్రి.. ఎసెక్స్‌ కౌంటీ సిబ్బందితో మాట్లాడాడు. తర్వాతే మ్యాచ్‌ను కుదించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.