లాకప్ డెత్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు!

వాస్తవం ప్రతినిధి: సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం సంచలన తీర్పును వెలువరించింది.  ఒక యువకుడి లాకప్‌ డెత్‌ కేసుకు సంబంధించి మొత్తం ఐదుగిరి పోలీసులను దోషులుగా తేల్చిన కేరళ  సీబీఐ  ప్రత్యేక కోర్టు  ఇద్దరు కానిస్టేబుళ్లకు  మరణ శిక్షను  విధించింది.  దీంతోపాటు రెండు లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు ఈ కేసులో ఎస్‌ఐ, సీఐలకు అసిస్టెంట్‌ కమిషనర్లకు మూడేళ్ల జైలు శిక్షను కూడా ఖరారు చేయడం గమనార‍్హం. 2005లో  ఉదయ్‌ కుమార్ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడు. దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న ఉదయ కుమార్ ను పోలీసులు తీవ్రంగా హింసించి,హత్య చేసారని అతడి తల్లి పిటీషన్ దాఖలు చేసింది. ఈ నేపధ్యంలో 2007 లో సీబీఐ దీనిపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది. అప్పట్లో తీవ్ర సంచనలం రేపిన ఈ  హత్య కేసులో పోలీసు కానిస్టేబుళ్లు జితు కుమార్‌, శ్రీ కుమార్లను ప్రధాన నిందితులుగా తేల్చింది.  అలాగే  ఈ కేసులో కుట్ర నేరారోపణలు, సాక్ష్యాలను నాశనం చేయడం తదితర ఆరోపణల కింద సబ్ ఇన్స్పెక్టర్ అజిత్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇ.కె. సాబుతోపాటు అప్పటి అసిస్టెంట్ కమిషనర్ ఫోర్ట్ కే హరిదాస్‌కు కూడా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మరోవైపు ఈ తీర్పుపై బాధితుడి తల్లి  ప్రభావతి అమ్మ సంతృప్తిని వ్యక్తం చేశారు. తన పదమూడేళ్ల పోరాటం ఫలించిందనీ,  తన కొడుకు కోల్పోయినప్పటినుంచి తనకు కంటిమీద కునుకులేకుండా పోరాటం చేశానంటూ గుర్తు చేసుకున్నారు.