రేపటి నుంచి  ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడనున్న టీమిండియా

వాస్తవం ప్రతినిధి: ఆగస్టు 1 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో టీమిండియా రేపటి నుంచి చేమ్స్ ఫోర్డ్ లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అయితే టెస్టు సిరీస్‌కు సంబంధించి కోహ్లీ సేన మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నట్లు బీసీసీఐ పేర్కొంది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌ ద్వారా పంచుకుంది. వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు కొన్ని రోజుల పాటు తమ కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌ వీధుల్లో విహరిస్తూ కనిపించారు. అయితే మళ్లీ జట్టుతో కలిసిన కోహ్లీ, ధావన్‌, దినేశ్ కార్తీక్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా నెట్స్‌లో శ్రమిస్తూ కనిపించారు.

ఇదిలా ఉండగా, రేపటి నుంచి ప్రారంభం కానున్న వార్మప్‌ మ్యాచ్‌ను మూడు రోజులకే కుదించాలని టీంఇండియా కోరినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం తెలియరాలేదు. ఇంతకుముందు విదేశీ పర్యటనలోనూ టీంఇండియా వార్మప్‌ మ్యాచ్‌లను కుదించిన సందర్భాలూ లేకపోలేదు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలోనూ టీంఇండియా నెట్స్‌లో ఎక్కువ సమయం గడిపేందుకుగానూ ఇలాగే వార్మప్‌ మ్యాచ్‌ను కుదించారు.