పాక్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు….31 మంది మృతి!

వాస్తవం ప్రతినిధి: పొరుగు దేశం పాకిస్తాన్ లో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ జరుగుతున్న ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్‌లో 11వ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్‌) ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బలొచిస్తాన్‌, క్వెట్టాలో ఉగ్రవాదులు బుధవారం ఉదయం ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 31 మంది మృతి చెందగా చాలా మంది గాయపడినట్లు తెలుస్తుంది. ఆస్ట్రన్‌ బైపాస్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల వాహనాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు కొనసాగించడం తో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. వెంటనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. ఈ ఉదయం 8 గంటలకు ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమవగా, సాయంత్రానికి పోలింగ్ ముగిసి పోతుంది. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. కేవలం 24 గంటల సమయంలోనే రాజకీయ పార్టీల భవితవ్యం తేలనుంది. దాదాపు పదికోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.