పరమ చెత్త రికార్డ్ ను నెలకొల్పిన ఇంగ్లాండ్ జట్టు!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ సరికొత్త రికార్డులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  అయితే తాజాగా అదే ఇంగ్లాండ్‌కు చెందిన ఓ క్లబ్‌ జట్టు క్రికెట్‌ చరిత్రలో పరమ చెత్త రికార్డును నెలకొల్పింది. ఫలితంగా వంద ఓవర్ల మ్యాచ్‌ కాస్త.. కేవలం ఒక్క గంటల్లోనే  ముగియడం విశేషం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జట్టు 49నిమిషాల్లోనే రెండెంకల లక్ష్యాన్ని నిర్దేశించి చాప చుట్టేయగా, ఛేదనకు దిగిన జట్టు 12నిమిషాల్లోనే లాంఛనాన్ని పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌కు ఇంగ్లాండ్‌లోని కెంట్ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేదికైంది. అసలేం జరిగిందంటే.. లీగ్‌లో భాగంగా బెక్‌హామ్‌ క్రికెట్‌ క్లబ్‌, బెక్స్‌లే క్రికెట్‌ క్లబ్‌ మధ్య వన్డే మ్యాచ్‌ జరిగింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెక్‌హామ్‌ జట్టు 11.2ఓవర్లలోనే 18పరుగులకే ఆలౌటైంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో 49నిమిషాల్లోనే వారి పోరాటానికి తెరపడింది. అనంతరం 19పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బెక్స్‌లీ ఒక్క వికెట్‌ కోల్పోయి 3.3ఓవర్లలోనే ఛేదించింది.