జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ స్పందన

వాస్తవం ప్రతినిధి: వైసీపీ అధినేత జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ మీడియాతో మాట్లాడుతూ.. స్వార్థ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం కొంత‌మంది నాయ‌కులు జ‌నం మ‌ధ్య త‌గాదాలు పెట్టి విభ‌జించి పాలిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అటువంటి వారిని నిలువ‌రించి ధైర్యంగా ఎదుర్కోవ‌డానికే జ‌న‌సేన పార్టీని ప్రారంభించానని అన్నారు. తాను బలమైన వ్యక్తిని కనుకనే తనపై జగన్ విమర్శలు చేశారని అన్నారు. మార్పు కోసం ప్రయత్నిస్తున్నాననే కోపంతోనే జగన్, బీజేపీ నేతలు తనపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ కే అంతుంటే, నిజాయతీ పరుడినైన తనకు ఎంత ఉండాలని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం రాసింది చంద్రబాబో, జగనో కాదని చురక అంటించారు. సామాజికమార్పే ‘జ‌న‌సేన’ ఆశ‌యం అన్నారు. రాజ‌కీయాల‌కు శ్ర‌మ‌, ఓపిక చాలా అవ‌స‌ర‌మ‌ని   ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. సామాజికమార్పు తీసుకురావడం త‌న ఆశ‌య‌మ‌ని, దానికోసమే సినిమాల‌ను సాధ‌నంగా ఉప‌యోగించుకున్నాన‌ని తెలిపారు.