చంద్రగ్రహణం నాడు శ్రీవారి ఆలయం మూసివేత

వాస్తవం ప్రతినిధి: ఈ నెల 27న శుక్రవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం దాదాపు 12 గంటల పాటు మూతపడనుంది. గ్రహణ సమయంలో స్వామివారి ఆలయంతో పాటు అన్నదాన సత్రాన్ని కూడా మూసివేయనున్నామని టీటీడీ అధికారులు ఈ ఉదయం ప్రకటించారు. 27 సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామని, ఆపై 28 తెల్లవారుజామున 4.15 గంటలకు ఆలయాన్ని తెరచి, శుద్ధి కార్యక్రమం అనంతరం ఇతర పూజలు జరుగుతాయని తెలిపారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంతో పాటు, వివిధ ప్రాంతాల్లో అన్న ప్రసాద వితరణ కూడా ఆ సమయంలో ఉండదని,శుక్రవారం మధ్యాహ్నం నుంచి భక్తులను క్యూలైన్లలోకి అనుమతించరని, భక్తులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని సహకరించాలని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు సూచించారు.