ఒక గ్రామాన్ని అతలాకుతలం చేసిన కార్చిచ్చు

వాస్తవం ప్రతినిధి:  కార్చిచ్చు ఓ గ్రామాన్ని అతలాకుతలం చేసింది.  గ్రీస్ రాజధాని ఎథెన్స్ సమీపం లోని రిసార్ట్ టౌన్ మాటీ లో ఈ ఘటన చోటుచేసుకుంది.  కొన్ని గంటలపాటు పదుల సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనలో కనీసం 100 మంది మృతిచెందగా, మరో 1000 మందికి కాలిన గాయాలైనట్లు సమాచారం. చనిపోయిన వారిలో ఎక్కువగా వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. సోమవారం నుంచి మంగళవారం వరకు అగ్నికీలలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మంటల్ని అదుపులోకి తెచ్చినా.. పదే పదే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రీస్‌ అధికారులు వెల్లడించారు. మంటలనుంచి తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు బీచ్‌ల వైపు పరుగులు తీయగా, మరోవైపు కార్చిచ్చు వందల ఇళ్లు, కార్లు, ఇతర వాహనాలను బుగ్గి చేసింది. మాటీ గ్రామంలో 26 మంది అక్కడికక్కడే మంటల్లో ఆహుతైనట్లు స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. రెడ్‌క్రాస్‌కు చెందిన ఓ అధికారి మంగళవారం ఘటనకు సంబంధించి పలు విషయాలు తెలిపారు. వేడి కారణంగా అడవుల్లో ఏర్పడ్డ కార్చిచ్చు పట్టణాన్ని మొత్తం ఆహుతి చేసిందన్నారు.