ఈ కారు ధర అక్ష‌రాలా రూ.121 కోట్లు

వాస్తవం ప్రతినిధి: ప్రపంచంలో కుబేరులు చాలామందే ఉండొచ్చు. కానీ.. ఈ కారును ముగ్గురు మాత్రమే సొంతం చేసుకోగలరు. ఈ కారు స్పెషాలిటీ ఏమంటే.. ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన కారు. మామూలుగా కారు ధ‌ర‌లు నాలుగైదు ల‌క్ష‌లు మొద‌లుకుని కోటి రూపాయ‌ల ధ‌ర దాకా ప‌లుకుతుంటాయి. ల‌గ్జ‌రీ కార్లు, స్పోర్ట్స్ కార్లు ధ‌ర‌లు మాత్రం రూ. 20, 30 కోట్లు ఉంటాయి. అస‌లు కోటిరూపాయ‌ల కారునే సామాన్యులు ఆశ్చ‌ర్యంగా చూస్తుంటారు. రూ.20, 30 కోట్ల రేటు ప‌లికే కార్ల గురించి అయితే ఇక చెప్పాల్సిన ప‌నిలేదు. అలాంటిది ఈ కారు ధ‌ర చూస్తే ఇక ఎవ‌రికీ నోట‌మాట‌రాదేమో!

ఇటలీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పగానీ ఆటోమొబైల్ పగానీ జోండా హెచ్ పీ బార్ చెట్టా పేరుతో విడుదలైన ఈ విలాసవంతమైన కారు.. ప్రముఖుల్ని సైతం సామాన్యులుగా మార్చి.. భలే ఉంది. . కానీ కొనలేమన్నట్లుగా చేయటం దీని స్పెషాలిటీ.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఖరీదైన కార్లను మూడంటే.. మూడే రిలీజ్ చేయటం. అత్యంత ఖరీదైన ఈ కార్ల ముచ్చట ప్రపంచ ప్రజలకు తెలిసే లోపే.. ఈ కార్లను బుక్ చేసుకున్నారట. ఈ కార్ల కంపెనీ వ్యవస్థాపకుడు హోరాసియో పగానీ ఒక కారును తనతో ఉంచేసుకుంటే.. మిగిలిన రెండు కార్లను ఇప్పటికే అమ్మేశారు.

ఇంతకీ.. ఈ కారు సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. 7.3 లీటర్ మెర్సిడెస్ ఏఎంజీ ఎం120వీ12 ఇంజిన్.. సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ప్రత్యేకతలుగా చెబుతున్నారు. సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవటం 3.1 సెకన్లలోనే అందుకోవటం ఈ కారు ప్రత్యేకతగా చెబుతున్నారు. ఇప్పటివరకూ ప్రపంచంలోనే ఖరీదైన కారుగా ఉన్న రోల్స్ రాయిస్ స్వెప్ టెయిల్ దీని ముందు దిగదుడుపే అంటున్నారు. ఎందుకంటే ఆ కారు ఖరీదు కేవలం రూ.84 కోట్లు మాత్రమే మరి.