ఇక కేవలం 25 అడుగులే… శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు!

వాస్తవం ప్రతినిధి:శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 860 అడుగులకు చేరింది. ఎగువ నుంచి దాదాపు 2.43 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటం, జలాశయం నుంచి కేవలం 1,350 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతూ ఉండటంతో రిజర్వాయర్ శరవేగంగా నిండుతోంది. ఇప్పటికే నీరు గేట్లను తాకింది.

ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాల నుంచి వస్తున్న నీటిని వచ్చినట్టుగా నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు వదులుతుండటంతో, మరిన్ని రోజుల పాటు వరద కొనసాగే అవకాశం ఉండటంతో ఈ సీజన్ లో అనుకున్న సమయం కన్నా ముందుగానే శ్రీశైలం రిజర్వాయర్ నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 107 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, జలాశయం సామర్థ్యం 215 టీఎంసీలన్న సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, భారీ వర్షాల కారణంగా సుంకేశుల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరగడంతో 11 గేట్లను ఎత్తివేసి 46 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.