ఇంట్లో తుపాకీతో పేల్చి బయట తిరిగేవాళ్ల సంగతేంటి..? పవన్ కల్యాణ్

వాస్తవం ప్రతినిధి: ఇంట్లో తుపాకీతో కాల్చిన వారు ఇప్పుడు బయట తిరుగుతున్నారని, పోలీసులు వాళ్లను ఎంతమాత్రమూ పట్టించుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. జనసేన పోరాటయాత్రలో భాగంగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలసిందే. అయితే మంగళవారం కాలు బెణకడంతో భీమవరంలో పవన్‌ విశ్రాంతి తీసుకున్నారు. అక్కడికి వచ్చిన వేలాది మంది అభిమానులతో ఆయన ముచ్చటించారు. తమను పోలీసులు ఇబ్బంది పెడ్తున్నారని, బైక్‌ సైలెన్సర్‌ తీసి శబ్ధం చేస్తే తప్పంటున్నారని ఈ సందర్భంగా అభిమానులు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. తమ పార్టీ కార్యకర్తలు బైక్‌ సైలెన్సర్‌ తీసి శబ్ధం చేస్తే తప్పంటున్నారని, మరి ఇంట్లో తుపాకీతో కాల్చి బయట తిరుగుతున్నవారిని మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన పరోక్షంగా బాలకృష్ణ ఇంట్లో కాల్పుల అంశాన్ని ప్రస్తావించారు. జ‌న‌ సైనికుల సంస్కారం చాలా గొప్ప‌ద‌ని వ్యాఖ్యానించిన ఆయన, అధికారులు లంచాల మ‌త్తులో మునిగి ఉన్నారని, అక్ర‌మంగా ఆక్వాకు వంత‌ పాడ‌ుతున్నారని, అందువల్లే తాగు నీరు క‌లుషిత‌మ‌వుతుంద‌ని ఆరోపించారు.
2004లో బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలగా, నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి గాయపడిన సంగతి తెలిసిందే. ఆ కేసులో బాలకృష్ణపై ఆరోపణలు వచ్చినప్పటికీ, ఎవరు కాల్చారో తనకు తెలియదని బెల్లంకొండ చెప్పడంతో, సరైన సాక్ష్యాలు లేని కారణంగా న్యాయస్థానం ఈ కేసును కొట్టేసింది.