సరిహద్దు దాటి బారత్ లో అడుగుపెట్టిన కాశ్మీర్ బాలుడు…తిరిగి ఇంటికి వెళ్లేందుకు నిరాకరణ

వాస్తవం ప్రతినిధి: సరిహద్దు దాటి భారత్‌లో అడుగుపెట్టిన ఓ కాశ్మీరీ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఏడాది జైల్లో ఉన్న ఆ బాలుడిని విడుదల చేస్తే సంతోషంగా ఇంటికి వెళ్ళకుండా భారత్ లోనే ఉంటానని పట్టుబడుతుండడం విశేషం. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన అష్ఫఖ్‌ అలీ అనే 16 ఏళ్ల బాలుడు 2017 మే నెలలో కాశ్మీర్‌లోని రజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఈ నేపధ్యంలో అతడిని ఏడాది పాటు జైలు ఉంచి ఈ రోజే విడుదల చేయడం తో అతడు తిరిగి ఇంటికి వెళ్ళకుండా భారత్ లోనే ఉంటానని పోలీసులను వేడుకొంటున్నాడు. ఆరోజు నేను పొరపాటున సరిహద్దు దాటి వచ్చాను. భారత్‌లో 14 నెలలు ఉన్నాను. ఇప్పుడు నాకు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌కు వెళ్లాలని లేదు. ఇక్కడే ఉండి ఏదన్నా ఉద్యోగం చేసుకోవాలని ఉంది. భారత్‌ మంచి దేశం. నేను ఇక్కడ హాయిగా పనిచేసుకోగలుగుతాను. ఇందుకు భారత ప్రభుత్వం అనుమతిస్తుందని ఆశిస్తున్నానుఅని తెలిపాడు. అష్ఫఖ్‌ కుటుంబీకులు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని దూంగా పెహ్లీ అనే ప్రాంతంలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే భారత పోలీసులు అష్ఫఖ్‌ను అరెస్ట్‌ చేసినప్పుడు అతని వద్ద అనుమానాస్పద వస్తువులేమీ లభించకపోవడంతో జమ్ము కశ్మీర్‌లోని రణ్‌బీర్‌ సింగ్‌ పోరా జిల్లాలోని జువెనైల్‌ హోంకు తరలించారు. ఈ ఏడాది జనవరిలో అష్ఫఖ్‌ తప్పించుకునేందుకు యత్నించాడు. జువెనైల్‌ హోంలోని కిటికీ నుంచి దూకి పారిపోయాడు. అదే రోజున పోలీసులు అష్ఫఖ్‌ను పంజాబ్‌లోని భటిండా ప్రాంతంలో పట్టుకున్నారు. అప్పుడు తన స్వస్థలానికి పారిపోవాలనుకున్న అష్ఫఖ్‌ ఇప్పుడు భారత్‌ను వదిలి వెళ్లాలని లేదని చెప్పడం గమనార్హం.