శివానీ ఎంట్రీ మాములుగా లేదు..

వాస్తవం సినిమా: హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్ ద్వారా శివానీ వెండితెరకు పరిచయమవుతోంది. ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం ‘2 స్టేట్స్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వి.వి. వినాయక్ వద్ద పలు చిత్రాలకు కో–డైరెక్టర్‌గా వ్యవహరించిన వెంకట్ కుంచ‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అడివి శేష్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ చిత్రానికి సంగీతం అందించ‌నుండ‌గా, ‘క్షణం’ చిత్రానికి పనిచేసిన షానియెల్ డియో సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు శివానీ తెలుగు సినిమాలో మాత్రమే కాదు .. తమిళ .. మలయాళ భాషల్లోను ఆమె ఎంట్రీ ఇస్తోంది. తమిళంలో విష్ణు విశాల్ జోడీగా ఆమె ఒక సినిమా చేస్తోంది. వీవీ స్టూడియోస్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం ‘మధురై’లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. తమిళ దర్శకుడు వెంకటేశ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దీనిని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మలయాళంలో మోహన్ లాల్ కుమారుడు ‘ప్రణవ్’ జోడీగా కూడా శివాని నటించనుందనే వార్త వినిపిస్తోంది. మొత్తానికి శివాని ఒకేసారి మూడు భాషల్లోను ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందన్న మాట.