రాజస్తాన్ లో దారుణం

వాస్తవం ప్రతినిధి: రాజస్తాన్ లో దారుణం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఆవులను అక్రమ రవాణా చేస్తున్నాడన్న ఆరోపణలతో ఒక వ్యక్తి పై మూక దాడికి పాల్పడడం తో అతడు మృతి చెందినట్లు తెలుస్తుంది.  అక్బర్‌ అనే వ్యక్తి ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు భావించిన మూక దాడికి దిగి తీవ్రంగా కొట్టడం తో షాక్‌కు గురై అక్బర్‌ ప్రాణాలు విడిచినట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ నివేదికను మంగళవారం వైద్యులు విడుదల చేశారు. ‘అక్బర్‌పై ఎక్కువ మంది దాడి చేయడం వల్ల షాక్‌కు గురయ్యాడు. ఆయుధాలతో అతడిపై దాడి చేశారు. దీంతో అంతర్గతంగా రక్తస్రావం అయి ప్రాణాలు కోల్పోయాడు’ అని పోస్టుమార్టం నిర్వహించిన బృందంలోని ఓ వైద్యుడు రాజీవ్‌ గుప్తా వెల్లడించారు. దాడి జరిగిన మూడు గంటల తర్వాత పోలీసులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు మృతి చెందాడు. అక్బర్‌ శరీరంపై ఏడు, ఎనిమిది పెద్ద గాయాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గతవారం అక్బర్‌ ఆవులను అక్రమంగా తరలిస్తున్నాడనే అనుమానంతో కొంతమంది దాడి చేశారు. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపధ్యంలో ఈ ఘటనపై విచారణ చేసేందుకు రాజస్థాన్‌ పోలీసులు ఉన్నత స్థాయి కమిటీని వేశారు. పోలీసులు ఆలస్యం చేసిన విషయాన్ని ఉన్నతాధికారుల బృందం నిర్ధారించింది. ఇందుకు బాధ్యుడైన ఏఎస్‌ఐని సస్పెండ్‌ చేయగా, మరో ముగ్గురు కానిస్టేబుళ్లను బదిలీ చేసినట్లు తెలుస్తుంది.