మ్యాచ్ మధ్యలో ఇంగ్లాండ్ క్రికెటర్ కు హిందీ నేర్పిన స్మృతి

వాస్తవం ప్రతినిధి: ఉమెన్స్‌ క్రికెట్‌ సూపర్‌ లీగ్‌ అరంగేట్రం మ్యాచ్‌లోనే భారత క్రికెటర్‌ స్మృతి మంధాన అదరగొట్టింది. ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న కేఎస్‌ల్‌ టోర్నీలో వెస్ట్రన్‌ స్టార్మ్‌ తరఫున ఆడిన ఆమె 20 బంతుల్లో 48 పరుగులు చేసి తృటిలో అర్ధశతకాన్ని చేజార్చుకుంది. అలానే ఇదే మ్యాచ్ లో వెస్ట్రన్ స్మార్ట్ జట్టు కెప్టెన్‌, ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ హీదర్‌ నైట్‌ అద్భుతంగా రాణించి.. 62 బంతుల్లో 97 పరుగులు చేసి శతకానికి చేరువలో నిలిచింది. అయితే వీరిద్దరూ రెండో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే ఈ మ్యాచ్ లో స్మృతి హీదర్ నైట్ కి హిందీ నేర్పించిందట. ఈ విషయాన్నీ హీదర్ మ్యాచ్ అనంతరం ట్విటర్ ద్వారా తెలిపింది.  టాంటన్‌లోని కౌంటీ మైదానంలో జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో వెస్ట్రన్‌ స్టార్మ్‌ జట్టు.. యార్క్‌షైర్‌ డైమండ్స్‌ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్‌ మధ్యలో తనకు హిందీ నేర్పింది అని హీదర్ తెలిపింది. ఇద్దరూ కలిసి బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో మధ్యలో తనకు కొన్ని హిందీ పదాలు నేర్పిందని  ‘మంధానతో కలిసి బ్యాటింగ్‌ చేయడం ఎంతో సరదాగా ఉంది. ఆమె మధ్యలో నాకు కొన్ని హిందీ పదాలు నేర్పింది.’ అంటూ మ్యాచ్‌ అనంతరం నైట్‌ ట్విటర్‌లో పేర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యార్క్‌షైర్‌ జట్టు 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం వెస్ట్రన్‌ స్టార్మ్‌ జట్లు 15.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.