మరోమారు సచివాలయం చేరిన జేసీ పంచాయతీ

వాస్తవం ప్రతినిధి: అనంత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల తాను అన్యమస్కంగానే టీడీపీలో కొనసాగుతున్నట్లు, వర్తమాన రాజకీయాల పట్ల విరక్తితో ఉంటున్నట్లు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు . పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వెళ్ళేది లేదంటూ మొరాయించినప్పుడు కూడా చంద్రబాబు బుజ్జగింపులతో దారికి తెచ్చుకున్నారు. అనంతలో రోడ్ల విస్తరణ పనులపై జీవో జారీతో ఆయన అప్పట్లో మెత్తబడ్డారు. మరోమారు ఆయన పంచాయతీ సచివాలయం చేరింది. ఆకస్మికంగా అమరావతి చేరుకున్న జేసీ.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.   రాజీ కుదరని పక్షంలో అక్కడికక్కడే, పార్టీకి, ఎంపీ పదవికీ రాజీనామా చేస్తారన్న ఊసు కూడా వినబడింది. కానీ.. భేటీ అనంతరం జేసీ.. మీడియాతో మాట్లాడుతూ .. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశాను. ఇప్పుడు అంతా ఆల్‌ రైట్’’ అని అన్నారు.తాను ఎవరి మీదో అలిగి పార్లమెంటుకు వెళ్లలేదనేది నిజం కాదని దివాకర్‌రెడ్డి చెప్పారు. సీఎం చంద్రబాబును కలిసి అంతా వివరించానని, అయితే ఆయనతో ఏం మాట్లాడాననే విషయాన్ని బయటకు చెప్పనన్నారు. ప్రస్తుతం రాజకీయ వాతావరణం బాగాలేదని,రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రత్యేక హోదాపై తీర్మానం ఒట్టి మాటేనన్న జేసీ,అధికారంలో ఉండి చేయలేనిది ఇప్పుడేం చేస్తారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.