భారత క్రికెట్ జట్టు మొట్ట మొదటి కెప్టెన్ సీ కే నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించిన కుంబ్లే

వాస్తవం ప్రతినిధి: భారత క్రికెట్‌ జట్టు మెట్టమొదటి కెప్టెన్‌ దివంగత సీకే నాయుడు విగ్రహాన్ని భారత మాజీ క్రికెట్ కోచ్ అనిల్ కుంబ్లే ఆవిష్కరించారు.  ఆయన స్వస్థలమైన మచిలీపట్నంలో సీకే నాయుడు విగ్రహాన్నిఏర్పాటు చేయడం గర్వకారణమని అనిల్‌ కుంబ్లే అన్నారు. అలానే ఈరోజు కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పర్యటించిన ఆయన 13 ఎకరాల్లో రూ.15 కోట్ల నిధులతో నిర్మించనున్న అథ్లెటిక్‌ స్టేడియానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా పరిషత్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీకే నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించి  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత క్రికెట్‌ జట్టు అభివృద్ధికి పునాదులు వేసిన గొప్ప క్రికెటర్‌ సీకే నాయుడు అని, అలాంటి ఆయన విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించటం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని కుంబ్లే  అన్నారు. రాష్ట్ర క్రీడల మంత్రి కొల్లు రవీంద్ర, శాప్‌ ఎండీ బంగార్రాజు, శాప్‌ ఛైర్మన్‌ వెంకన్న చౌదరి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.