ప్రత్యేక హోదా కోసం వైసీపీ బంద్.. రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతల అరెస్ట్!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయానికి సంబంధించి రాష్ట్ర విభజన చట్టం అమలుపై కేంద్రం తీరుకు నిరసనగా వైసీపీ నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తోంది. బంద్ సందర్భంగా పోలీసులు పలువురు నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రోడ్డుపైకి వచ్చిన నేతలు కాలేజీ, స్కూలు, వ్యాపార సంస్థలను మూసివేయించారు. ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి రాకుండా అడ్డుకుంటున్నారు.
ఏపీలో బంద్ వేకువజాము నుంచే మొదలైంది. కొన్ని జిల్లాల్లో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యయి. బస్టాండ్‌ల దగ్గర 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. బస్సుల్ని అడ్డుకున్న పలువురు నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. బలవంతంగా షాపులు మూయించినా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

విశాఖలో బొత్స సత్యనారాయణ, గుంటూరులో అంబటి రాంబాబు, శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు, రేపల్లెలో మోపిదేవ వెంకటరమణ, నరసాపురంలో ముదునూరి ప్రసాద్‌రాజు, నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధర్నా చేస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు.

తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలులో బీవై రామయ్య, హఫీజ్ ఖాన్, తెర్నకల్ సురేంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలులో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పులివెందులలో వైఎస్‌ వివేకానందరెడ్డిని, విజయవాడలో పార్థసారథి, యలమంచిలి రవిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గర బైఠాయించి ఆందోళనకు దిగిన వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు కొన్నిచోట్ల ఆందోళనలు శృతిమించడంతో పలువరు వైసీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.