ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చంద్రబాబు అణచివేస్తున్నారు: మధు

వాస్తవం ప్రతినిధి: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అణచివేయాలనుకోవడం దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అభిప్రాయపడ్డారు. ఏపీ కి ప్రత్యెక హోదా కోసం వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు బంద్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోహోదా కోసం బంద్‌ చేస్తున్న వైఎస్సార్‌సిపి నాయకులను అరెస్ట్‌ చేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందని పి మధు తెలిపారు. మరో నేత బాబూరావుతో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో చంద్రబాబు తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపిన మధు ఒక వైపు హోదా కోసం తాము పోరాడుతున్నామంటూ చెబుతున్న చంద్రబాబు, మరో వైపు పోలీసులతో అరెస్టులు చేయించడం ఏమాత్రం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలోనూ చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారని ఆరోపించిన ఆయన హోదా అనేది ఆంధ్రుల హక్కు. హోదా ఉద్యమానికి చంద్రబాబు మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేయొద్దుఅని మధు విన్నవించారు. అలానే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఉద్యమాలు చేయలేదా అని ప్రశ్నించారు. అరెస్ట్‌ చేసిన వైసిపి నాయకులను వెంటనే విడుదల చేయాలని మధు డిమాండ్‌ చేశారు.