న్యాయం కావాలని కోరుతూ నీళ్ల ట్యాంకు ఎక్కి నిరసన తెలిపిన 63 ఏళ్ల మహిళ

వాస్తవం ప్రతినిధి: భూమికి సంబంధించి పట్టా ఇవ్వకుండా అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకొంటానని మన్స్థాపం చెందుతూ ఓ 63 ఏళ్ల మహిళ నీళ్ల ట్యాంకు ఎక్కి నిరసన తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు దిగేది లేదంటూ దాదాపు 6 గంటలపాటు హల్‌చల్‌ చేసింది. వివరాల ప్రకారం..
ఖమ్మం జిల్లాలోని హైదర్‌సాయిపేటకు చెందిన అసీఫా బేగంకు గ్రామంలో 7 ఎకరాల భూమి ఉంది. అందులో 5 ఎకరాలకు పట్టా కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది. మిగిలిన 2 ఎకరాలకు తన పేరు మీద పట్టా చేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకుంది. ఇటీవల తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయగా తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పినట్టు ఆమె వాపోయింది. మనస్తాపానికి గురైన అసీఫా నిన్న ఉదయం కొక్కిరేణి స్టేజీ సమీపంలోని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కింది. ఆత్మహత్య చేసుకుంటానని హడావిడి చేసింది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని ఆమెకు నచ్చజెప్పినా ఆమె కిందకు దిగేందుకు ససేమిరా అన్నది. ఆఖరికి ఆమె మనవడు విజ్ఞప్తి మేరకు కిందకు దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.