దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు ఉన్నాయి!

వాస్తవం ప్రతినిధి: దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలూ ఉన్నాయని శబరిమల సంప్రదాయాన్ని సమర్ధిస్తూ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి మంగళవారం సుప్రీం కోర్టుకు తన వాదనలు వినిపించారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని నిరోధించడంపై దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానంలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మంగళవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం శబరిమల సంప్రదాయాన్ని సమర్దిస్తున్న న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీ వాదనలను విన్నారు. ఈ సందర్భంగా సంఘ్వీ పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. మరోపక్క శబరిమల ఆలయంలో పురుషులు పూజలు నిర్వహిస్తే మహిళలనూ అందుకు అనుమతించాలని, మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పురుషులకు వర్తించినదే మహిళలకూ వర్తిస్తుందని సుప్రీం తేల్చిచెప్పింది. మహిళలు ప్రార్ధన చేసుకోవడానికి ఏ చట్టం అనుమతి అవసరం లేదని, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని కోర్టు పేర్కొంది.