కథానాయిక ప్రాధాన్యత కలిగిన మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పిన స్వీటీ

వాస్తవం సినిమా: తెలుగులో కథానాయిక ప్రాధాన్యత కలిగిన కథలను రెడీ చేసుకున్న దర్శక నిర్మాతలకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు .. అనుష్క (స్వీటీ ). కథా భారాన్ని పూర్తిగా మోస్తూ .. సమర్థవంతంగా నడిపించగలిగిన సత్తా ఆమెకి వుంది. ‘అరుంధతి’ .. ‘రుద్రమదేవి’ .. ‘భాగమతి’ వంటి సినిమాలు .. అవి సాధించిన విజయాలే అందుకు నిలువెత్తు నిదర్శనం. అలాంటి అనుష్క తాజాగా మరో ప్రాజెక్టును ఓకే చేసినట్టుగా ఒక వార్త ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక కథను నూతన దర్శకుడు హేమంత్ వినిపించడంతో ఆమె అంగీకరించినట్టుగా చెబుతున్నారు. కోన కార్పొరేషన్ .. పీపుల్స్ మీడియా వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో అనుష్క సరసన మాధవన్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అనుష్క కోసమే లేడీ ఓరియెంటెడ్ కథలు మరో రెండు రెడీ అవుతున్నట్టుగా సమాచారం. తమిళంలో నయనతార మాదిరిగా .. ఇకపై తెలుగులో ఈ తరహా పాత్రలనే అనుష్క ఎక్కువగా చేస్తూ వెళుతుందేమో.