అమెరికా హెచ్చరికలపై స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి

వాస్తవం ప్రతినిధి: అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్‌ దేశాల నేతల మధ్య ఇటీవల అగ్గి రాజుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీలు వరుస ట్వీట్లతో పరస్పరం హెచ్చరికలు చేసుకున్నారు. పులి తో ఆటలు వద్దు అని అటు రౌహనీ, అమెరికాను భయపెట్టాలని చూడద్దు అంటూ మరోపక్క ట్రంప్ ఒకరినొకరు వార్నింగ్ ఇచ్చుకున్న సంగతి తెల్సిందే. ఈ  నేపధ్యంలో అమెరికా చేసిన హెచ్చరికల పై ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ స్పందించారు. ‘అస్సలు నచ్చడం లేదు.. కొన్ని నెలల క్రితం సంభవించిన అతి పెద్ద పేలుడు శబ్దాన్ని ప్రపంచ మొత్తం విన్నది. ఇరానియన్లు కూడా ఆ శబ్దాలను విన్నారు. నాగరిక ప్రపంచంలో 40 ఏళ్లుగా ఇలాంటి శబ్దాలు వింటూనే ఉన్నాం. ఇక చాలు.. ఎన్నో సామ్రాజ్యాలు కుప్పకూలి పోవడం మేము కళ్లారా చూశాం. అంతేకాదు మేము తలచుకోవడం వల్ల కొన్ని దేశాలు ఉనికి లేకుండా పోయాయి కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి’  అంటూ జావేద్‌ ట్వీట్‌ చేశారు. 2015లో ఇరాన్‌ న్యూక్లియర్‌ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న నాటి నుంచి ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది.