వైసీపీ లా పారిపోయేవాడిని కాదు: పవన్ కళ్యాణ్

వాస్తవం ప్రతినిధి: 2019 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగాలని చూస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందుకు తగినట్లుగానే అడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ ల తప్పులను బయటపెడుతూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా విజయవాడ లో జనసేన నేతలతో సమావేశమైన ఆయన సమక్షంలోనే కృష్ణా,గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైసీపీ ఫై విమర్శలు చేశారు. ఒకవేళ జనసేనకే 10 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే అసెంబ్లీలో నిలబడేవాడినని, వైసిపిలా పారిపోయేవాడిని కాదని పవన్ వ్యాఖ్యానించారు. అలానే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకే పార్టీని స్థాపించానని అన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేయాలని తాను అనుకున్నప్పటికీ ఓట్లు చీలుతాయని చంద్రబాబు చెప్పడంతో ఆగిపోయానని తెలిపారు. అలానే తాను బిజెపిని ఏమీ అనడం లేదని సిఎం చంద్రబాబు అనడంపై పవన్‌ మండిపడ్డారు. నాలుగేళ్ల పాటు టిడిపి గురించి ఏమీ మాట్లాడనప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా చివరిగా రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేపడితే మాత్రం ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.