రౌహనీ కి ఘాటుగా సమాధానం ఇచ్చిన ట్రంప్

వాస్తవం ప్రతినిధి: మొన్నటి వరకు అమెరికా, ఉత్తర కొరియా ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఇరు దేశాల అధ్యక్షులు సింగపూర్ లో భేటి అయి సమరశ్యంగా చర్చలు జరిపడం తో ఇప్పుడు పరిస్థితులలో మార్పులు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య దాదాపు అలాంటి యుద్ద వాతావరణమే నెలకొంది. ఈ నేపధ్యంలో అమెరికా, ఇరాన్‌ దేశాధినేతలు బహిరంగ హెచ్చరికలే చేసుకుంటున్నారు. 2015లో ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాన్ని ట్రంప్‌ వెనక్కి తీసుకున్న తరవాత నుంచి ఇరాన్‌ మీద యూఎస్‌ ఒత్తిడి పెంచుతోంది. దీంతో అమెరికాపై ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ.. నిన్న ట్రంప్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మిస్టర్ ట్రంప్‌.. సింహం తోక పట్టుకొని ఆటలాడుకోవద్దు. అది చివరికి తీవ్ర ప్రమాదానికి కారణమవుతుంది. ఇరాన్‌తో శాంతి సంబంధాలు నెలకొల్పడం ప్రపంచ శాంతికి కారణమవుతుంది. అదే ఇరాన్‌తో యుద్ధం అన్ని యుద్ధాలకు తల్లిలాంటింది’ అంటూ ఆయన అమెరికాపై తీవ్రంగా మండిపడ్డారు. అయితే నిన్న రౌహనీ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ దీటుగా నే స్పందించి కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చారు. ట్విటర్‌ వేదికగా రౌహనీపై నిప్పులు చెరిగారు. ‘రౌహనీ.. ఇంకోసారి అమెరికాను భయపెట్టాలని చూడకు. లేదంటే చరిత్రలో మీరెప్పుడూ చవిచూడని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ హింసాత్మక ధోరణికి మేమెప్పుడూ మద్దుతు ఇవ్వబోం. జాగ్రత్త..!’ అంటూ ట్రంప్‌ బదులిచ్చినట్లు తెలుస్తుంది.