ముగ్గురు పేసర్లు,ఇద్దరు స్పిన్నర్ల తో బరిలోకి దిగాలి: అజహరుద్దీన్

వాస్తవం ప్రతినిధి: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగాలని భారత మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ అంటున్నాడు. అశ్విన్‌తో పాటు కుల్‌దీప్‌ను కూడా తుదిజట్టులోకి తీసుకోవాలని అతను సూచిస్తున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మాజీ ఆటగాళ్లు అందరూ కూడా టీమిండియా సెలక్షన్ విషయంలో నోరు విప్పుతున్నారు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించడానికి అన్ని విభాగాల్లో బలంగా ఉన్న టీమ్‌ఇండియాకు ఇదే మంచి అవకాశమని అజహరుద్దీన్ చెప్పాడు. ‘‘టీమ్‌ఇండియాను నిలవరించడం ఇంగ్లాండ్‌కు కష్టమనే చెప్పాలి. ఎందుకంటే వాళ్లకు సరైన బౌలింగ్‌ కూర్పు లేదు. ఆ జట్టులో ఇద్దరే (అండర్సన్‌, బ్రాడ్‌) మంచి బౌలర్లున్నారు’’ అని అజహరుద్దీన్‌ అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టిన కుల్‌దీప్‌ యాదవ్‌ను టెస్టుల్లోనూ ఆడించాలని అజహరుద్దీన్‌ అంటున్నాడు. ‘‘పిచ్‌ పచ్చికతో ఉంటే నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలో దిగే అవకాశం ఉంది. కానీ విజయం సాధించాలంటే ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో ఆడడం ఉత్తమం. ఎందుకంటే మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ పిచ్‌ పొడిగా మారే అవకాశంతో పాటు చివరి రెండు రోజులు బంతి ఎక్కువగా తిరిగే వీలుంది. పచ్చిక పిచ్‌లు తయారుచేయడం వల్ల ఇంగ్లాండ్‌కు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే మన దగ్గర కూడా స్వింగ్‌ చేయగల నాణ్యమైన బౌలర్లున్నారు. కుల్‌దీప్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతని వల్ల ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అశ్విన్‌తో పాటు కుల్‌దీప్‌ను కూడా ఆడించాలి. జడేజా పెద్దగా ప్రభావం చూపుతాడని అనుకోవట్లేదు అని అజహరుద్దీన్‌ అన్నాడు.