‘భూసేకరణ చేస్తే ఎదురు తిరగండి’: ఉండవల్లి రైతులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్

వాస్తవం ప్రతినిధి: ఉండవల్లిలో పంట భూములలో రైతులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అమరావతి కోసం అవసరానికి మించి భూసేకరణ జరుగుతోందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.’రోడ్లకు రాజధానికి ఎంత కావాలో అంత తీసుకోవాలి గాని 120 రకాల పంటలు పండే భూములు తీసుకోవడం అన్యాయం, దారుణమన్నారు. రాజధానిలో పోలీసులు కేవలం డ్యూటీ చేస్తున్నారని, వారి వెనకుండి నడిపిస్తున్నది టీడీపీ అన్నారు. అధికారులను, పోలీసులను వ్యతిరేక భావంతో చూడరాదని… వీరంతా ప్రభుత్వ నిర్ణయాలను అమలుచేసే వారు మాత్రమేనని చెప్పారు. 1970లో విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో సేకరించిన భూమి ఇప్పటికి నిరుపయోగంగా ఉందన్నారు. ప్రభుత్వానికి మానవతా దృక్పథం లేదని, బలవంతపు భూసేకరణ చేసేప్పుడు కులాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. భూసేకరణ జరిగితే తనకు చెప్పమని రైతులకు సూచించారు. తాను కూడా వారితో కలిసి ఆందోళనలో పాల్గొంటానని చెప్పారు. రైతుల భూములను కాపాడడానికి ప్రాణాలివ్వడానికైనా సిద్ధమేనని అన్నారు.