బంద్ ల వల్ల నష్టపోయేది ఎవరు?: నక్కా ఆనంద్ బాబు

వాస్తవం ప్రతినిధి:  బందు ల వల్ల నష్టపోయేది ఎవరు ?అని మంత్రి నక్కా ఆనంద్ బాబు వైకాపాను నిలదీశారు. అసలు ఈ బంద్ ల వల్ల నష్టం ప్రధాని మోదీకా..? ఏపీకా? అని ఆయన వైకాపాను ప్రశ్నించారు. ఈ బంద్‌ల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, అందువల్ల బేషరతుగా బంద్ విరమించుకోవాలని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డికి సూచించారు. మోదీకి కాకుండా రాష్ట్రానికి నష్టం కలిగించే చర్యలను ఎందుకు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర బంద్‌కు వైకాపా పిలుపునిచ్చిన నేపథ్యంలో సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసారు.  ఒక రాష్ట్రంకోసం ఒకప్రాంతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం దేశ చరిత్రలో తొలిసారి అని ఆయన అన్నారు. పార్లమెంట్‌లో తెదేపా పార్టీ అవిశ్వాసం ప్రవేశపెట్టినప్పుడు జగన్,పవన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఒకరు కోర్టు లో మరొకరు ట్వీట్ లతో బిజీగా ఉన్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. అలానే పార్లమెంట్ లో తెదేపా పెట్టిన అవిశ్వాసానికి 126 మంది అనుకూలంగా ఓటేయడం చంద్రబాబు, తెలుగుదేశం ఎంపీల విజయమని అన్నారు. భాజపాకి మేలు చేసేందుకే వైకాపా ఎంపీలు రాజీనామా చేశారంటూ ఆయన ఆరోపించారు. అవినీతిని తొక్కేస్తానన్న నరేంద్రమోదీ.. జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్దన్‌ రెడ్డితో కలిసి అవినీతిని పెంచి పోషిస్తున్నారన్నారని ఆయన అన్నారు.