ధోనీ ప్రదర్శన పై స్పందించిన సచిన్

వాస్తవం ప్రతినిధి: ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో మాజీ కెప్టెన్‌ ధోనీ ప్రదర్శనపై చాలామంది పెదవి విరుస్తున్న సంగతి తెలిసిందే. అతను మునుపటిలా వేగంగా ఆడలేకపోయాడని.. జట్టుకు తోడ్పాటునందించే ప్రదర్శన చేయలేకపోయాడంటూ సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. మొన్నటివరకు బెస్ట్ ప్లేయర్ గా ఉన్న ధోనీ ఇప్పుడు ఈ విధంగా నామ మాత్రపు ఆట సాగిస్తే మాత్రం వచ్చే ఏడాది జరగబోయే ప్రపంచ కప్ జట్టులో అతనికి స్థానం దక్కడం కూడా సందేహమేనంటూ పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ధోనీ ప్రదర్శనపై తాజాగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ స్పందించాడు. వచ్చే ప్రపంచకప్‌కు జట్టులో ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరూ సిద్ధంగా లేరంటూ ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్‌ గురించి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి ఎలాంటి ఆలోచనల్లో ఉన్నారో నాకు తెలియదు. అయినా దానికి ఇంకా దాదాపు సంవత్సరం దాకా సమయం ఉంది. ఇక ధోనీ విషయానికొస్తే ప్రపంచకప్‌లో ఆడాలా వద్దా అనేది తనకు తానే నిర్ణయించుకోగలడు. అయినా ఏం జరుగుతుందో వేచి చూద్దామంటూ’ పేర్కొన్నాడు. ఇక ఇటీవల ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ను ఒకసారి పరిశీలిస్తే.. సిరీస్‌లో భాగంగా జట్టులో చాలా మార్పులు జరిగాయి. అలా అని అవన్నీ ఆటగాడి ప్రదర్శన ఆధారంగా చేసినవి కావు. వాటిలో కొన్ని ఆటగాడి ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకొని చేసినవి కూడా ఉన్నాయి. ఇక ప్రపంచకప్‌లో ధోనీకి ప్రత్యామ్నాయంగా ఎవరూ లేరు. దినేశ్‌ కార్తీక్ కొంతకాలంగా జట్టులో స్థానం దక్కించుకుంటున్నా.. అతనికి వన్డే క్రికెట్‌లో ఆడే అవకాశాలు అంతగా రావటం లేదు. అయితే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అతని ప్రదర్శనే వన్డేల్లో అతని భవిష్యత్తును నిర్ణయించేలా ఉందని సచిన్‌ చెప్పుకొచ్చాడు.