చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత లోకేష్ ఒక్కరికే ఉద్యోగం వచ్చింది: పవన్ కల్యాణ్

వాస్తవం ప్రతినిధి: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత లోకేష్ ఒక్కరికే ఉద్యోగం వచ్చిందని, ఉపాధి చూపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.నిన్న తన అమరావతిలో పర్యటనలో ఆయన మాట్లాడుతూ, 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆ మరుసటి రోజే రెండు పేపర్లకు లీకులిచ్చి విషయాన్ని బయటకు పొక్కేలా చేశారని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలుగుదేశం పార్టీపైన, చంద్రబాబుపైన ఆరోజే నమ్మకం పోయిందని, ఆ తరువాతే తాను బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీని కలిశానని అన్నారు. అంతకు రెండేళ్ల ముందే చంద్రబాబును కలిసి రాజకీయ పార్టీ గురించి చర్చిస్తే, ఓట్లు చీలుతాయని ఆందోళనపడిన ఆయన, పోటీ వద్దని సూచించారని చెప్పారు. లోకేష్ సీఎం అయితే తనకేమీ అభ్యంతరం లేదుగానీ, రాష్ట్రం ఏమవుతుందోనన్న భయం మాత్రం ఉందని అన్నారు. పుట్టుకతోనే ఎవరికీ రాజకీయ అనుభవం ఉండదని, తనకు రాజకీయ అనుభవం లేదని విమర్శిస్తున్న వారికి చురకలు అంటించారు. కిందపడ్డా, పైకి ఎక్కినా చివరకు అధికారం జనసేన పార్టీదేనని అన్నారు. ఈ సందర్భం గా ఉండవల్లి రైతుల సమస్యలపై తాను మాట్లాడటానికి గల కారణాన్ని చెప్పారు. వాళ్లు కూడా తోటి మనుషులేనని, ఆ భావనతోనే వారి సమస్యల గురించి మాట్లాడాను తప్ప, ఓట్ల కోసం కాదని అన్నారు.గత ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసుంటే బాగుండేదని, ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోనే టీడీపీకి మద్దతుగా నిలిచానని పవన్ కల్యాణ్ అన్నారు .