ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి…మృతి!

వాస్తవం ప్రతినిధి:  పాకిస్థాన్‌లోని కల్లోలిత ఖైబర్‌-పక్తుంఖ్వా రాష్ట్రంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో మాజీ మంత్రి ఇక్రాముల్లా గండాపూర్‌ చనిపోయారు. జులై 25న పాక్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) తరఫున రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ఇక్రాముల్లా గండాపూర్. ఈ క్రమంలో ఆదివారం ఎన్నికల సభలో పాల్గొనేందుకు ఇక్రాముల్లా వెళుతుండగా ఆయన కారును లక్ష్యంగా చేసుకొని డేరా ఇస్మాయిల్‌ ఖాన్‌ జిల్లాలో ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. దీనితో గండాపూర్ ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ ఎన్నిక కావాలని పలువురు మాజీ క్రికెటర్లు ఆకాంక్షిస్తున్నారు. వసీం అక్రం, వకార్‌ యూనిస్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన డీన్‌జోన్స్‌ కూడా తమ మద్దతు తెలిపారు.