ఆఫ్ఘన్ లో ఆత్మాహుతి దాడి….16 మంది మృతి!

వాస్తవం ప్రతినిధి: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్‌ లో మరోసారి ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. కాబూల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం బయట ఆదివారం ఈ ఆత్మాహుతి దాడి జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో 16 మంది మృత్యువాత పడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఆ దేశ ఉపాధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకొని ఈ ఆత్మాహుతి దాడి చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆఫ్గనిస్తాన్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రషీద్‌ దోస్తుమ్ తిరిగి స్వదేశానికి వస్తోన్న సమయంలో ఆయన్ను ఆహ్వానించడానికి ప్రజలు విమానాశ్రం వద్ద ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఈ పేలుళ్లు సంభవించడం తో ఈ దాడిలో 16 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో దోస్తుమ్‌ కు ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదని అక్కడి అధికారులు స్పష్టం చేశారు.