అస్వస్థతకు గురైన షరీఫ్!

వాస్తవం ప్రతినిధి: పనామా పత్రాల కు సంబందించిన కేసులో,అలానే అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఇటీవల అరెస్ట్ అయి రావల్పిండి లోని అడియాలా జైలు లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లు రావల్పిండిలోని అడియాలా జైలుకి చెందిన వైద్యుల బృందం తెలిపింది. ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పిన వైద్యులు వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించినట్లు తెలుస్తుంది. నవాజ్‌ షరీఫ్‌ రక్తంలో యూరియా, నత్రజని స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరాయని,అలానే హృదయ స్పందనలో కూడా తేడా కనిపిస్తోందని, డీ హైడ్రేషన్‌ సమస్యతో బాధపడతున్నట్లు వైద్యులు చెప్పారు. జైల్లో షరీఫ్‌కు చికిత్స అందించే వసతులు లేనందున వేరే ఆసుపత్రికి తరలించాలని తాత్కాలిక ప్రభుత్వానికి వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి నిర్ణయం తరువాతనే షరీఫ్‌ను ఆసుపత్రికి తరలించనున్నట్లు అడియాలా జైలు వర్గాలు తెలిపాయి.