అరుదైన ఘనత సాధించిన పాక్ ఆటగాడు

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్‌ ఓపెనర్‌ ఫకార్‌ జమాన్‌ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో వరుస రికార్డులతో చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో మరో ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హాక్‌తో కలిసి అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 304పరుగులు జోడించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అదే మ్యాచ్‌లో ఫకార్‌(210; 156బంతుల్లో 24×4, 5×6) అజేయంగా నిలిచి పాక్‌ తరఫున అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తొలి ద్విశతకం నమోదు చేసిన ఆటగాడిగా మరో రికార్డు కూడా సృష్టించాడు. అయితే ఇప్పుడు తాజాగా ఆదివారం జింబాబ్వేతో జరుగుతున్న ఐదో వన్డేలో ఫకార్‌ జమాన్‌(85; 83బంతుల్లో 10×4, 1×6) మరోసారి రెచ్చిపోయాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ చివరి బంతికి బౌండరీ బాది ఫకార్‌ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అదే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించడం. ఇప్పటివరకూ ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు వివ్‌ రిచర్డ్స్‌(21 ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగులు) పేరిట ఉండగా, ఫకార్‌ దానిని 18 ఇన్నింగ్‌లలోనే చేరుకున్నాడు. దీంతో తక్కువ ఇన్నింగ్‌లలోనే వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా ఫకార్‌ జమాన్‌ అరుదైన ఘనత సాధించాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 24 ఇన్నింగ్స్‌ల ద్వారా 2008లో వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరగా, ఫకార్‌ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకూ 18మ్యాచ్‌లాడి సగటు 76తో మొత్తం 1065పరుగులు సాధించాడు. అందులో మూడు శతకాలు, ఒక ద్విశతకం, ఆరు అర్ధశతకాలున్నాయి.