అన్నమయ్య వేషంలో వినూత్న నిరసన తెలిపిన చిత్తూరు ఎంపీ

వాస్తవం ప్రతినిధి: కేంద్రంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాసం వీగిపోయిన తరువాత, రెండు రోజుల విరామానంతరం ఈ ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకాగా,విభజన హామీల అమలులో ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఇవాళ టీడీపీ ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ, టీడీపీ నేత శివప్రసాద్, మరోసారి తనదైన శైలిలో ఓ వేషం వేసుకుని వచ్చి నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తానని తిరుమల వెంకన్న సాక్షిగా చెప్పిన నరేంద్ర మోడీ.. మాట తప్పారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అన్నమయ్య పాటలకు పారడీలు పాడారు. “అదిగో అల్లదిగో..” పాటను గుర్తు చేస్తూ, “అదిగో అల్లదిగో పార్లమెంటు భవనం… మోసాల దిగ్గజమూ మోదీ ఉన్న స్థలమూ… అదిగో అల్లదిగో పార్లమెంటూ భవనం” అంటూ పాటలు పాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మాటిచ్చి, ఆపై దాన్ని తుంగలో తొక్కిన నరేంద్ర మోదీ పట్ల ఏపి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిందేనంటూ కొన్ని పారడీ పాటలను ఆయన పాడారు.