అక్కినేని అభిమానులకు శుభవార్త..సమంత – చైతూ జంటగా కొత్త సినిమా లాంచ్

వాస్తవం ప్రతినిధి: ఇదివరకు అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా ‘ఏమాయ చేశావె’ సినిమా వచ్చింది. ఈ సినిమాతోనే ఇద్దరి మనసులు ఒకటయ్యాయి. 2017లో వీరిద్దరూ వివాహబంధంతో ఒకటయ్యారు. మధ్యలో ‘మనం’, ‘ఆటోనగర్ ‌సూర్య’ సినిమాల్లోనూ జంటగా నటించారు. అయితే పెళ్లి తరువాత సమంత .. చైతూలను తెరపై జంటగా చూడటానికి అభిమానులంతా ఆసక్తిని చూపుతూ వస్తున్నారు. మంచి కథ కుదరని కారణంగా ఈ విషయంలో ఆలస్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు శివ నిర్వాణ ఈ జంట కోసం ఓ కథను సిద్ధం చేశారు. కాగా..ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున .. తన చేతుల మీదుగా దర్శకుడు శివ నిర్వాణకి స్క్రిప్ట్ ను అందజేశాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో చైతూ .. సమంత భార్యభర్తలుగా కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. హిట్ కాంబినేషన్ కావడం వలన .. ‘నిన్నుకోరి’ తరువాత శివ నిర్వాణ చేస్తోన్న ప్రాజెక్టు కావడం వలన సహజంగానే అంచనాలు వున్నాయి.