పొడి బారిన పిచ్ లపై విజయం సాదించడం కష్టమే: సచిన్

వాస్తవం ప్రతినిధి: టీమిండియా కు టెస్ట్ సిరీస్ లో మంచి అవకాశాలు ఉంటాయని భారత లిటిల్ మాస్టర్ సచిన్ తెండూల్కర్ అభిప్రాయపడ్డారు. టీమిండియా చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌ను ఇంగ్లాండ్‌ టెస్టు సారథి జో రూట్‌ సమర్థంగా ఎదుర్కొన్నా పొడి పిచ్‌లపై సరిగ్గా సన్నద్ధం అయితే టీమిండియాకు టెస్టు సిరీస్‌లో మంచి అవకాశాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలానే కుల్‌దీప్‌ మరెంతో బాగా బౌలింగ్‌ చేయగలడని పేర్కొన్నారు.

‘నేను టెలివిజన్‌లో చూసినదాని ప్రకారం కుల్‌దీప్‌ బంతిని విడుదల చేసే మణికట్టు స్థానాన్ని ముందుగానే గ్రహించి జో రూట్‌ చక్కగా ఆడాడు. అయితే కుల్‌దీప్‌ బంతి వేసే విధానం సంక్లిష్టంగా ఉండటంతో అందరు బ్యాట్స్‌మెన్‌ అతడి బౌలింగ్‌ను బాగా ఎదుర్కోలేరు. మణికట్టు పొజిషన్‌ను త్వరగా అర్థం చేసుకున్నాడు కాబట్టే కుల్‌దీప్‌ బౌలింగ్‌ను ఆలస్యంగా ఆడి రూట్‌ విజయం సాధించాడు’ అని సచిన్‌ అన్నారు. ఇంగ్లాండ్‌లోని మిగతా బ్యాట్స్‌మెన్‌ కుల్‌దీప్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేరని పొడిబారిన పిచ్‌పై అతడు, మిగతా భారత స్పిన్నర్లు కీలకంగా నిలుస్తారని సచిన్‌ పేర్కొన్నారు.