నాలుగేళ్లుగా ఏపీలో అరాచక పాలన సాగుతోంది:కన్నా లక్ష్మీనారాయణ

వాస్తవం ప్రతినిధి:నాలుగేళ్లుగా ఏపీలో అరాచక పాలన సాగుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం సొమ్ముతో రాష్ట్రం సోకులు చేస్తోందని,చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవటానికి సీఎం చంద్రబాబు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు ఎప్పుడూ అడగలేదని, బాబు కోరిక మేరకే ప్రత్యేక ప్యాకేజ్ ని కేంద్రం ఇచ్చిందని, ఏపీలో జన్మభూమి బ్రోకర్ల పాలన నడుస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక టిడిపి బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని, దేశాభివృద్ధి కోసం అవినీతి, స్వార్ధానికి తావులేకుండా కులమతాలకతీతంగా నరేంద్ర మోడీ భారత ప్రధానిగా సామాజిక న్యాయంతో సమర్థవంతంగా పని చేస్తున్నాడన్నారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు. క్షణానికి ఒక మాట మాట్లాడుతూ యూటర్న్ తీసుకుంటున్న చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే నైతిక అర్హత లేదని కన్న దుయ్యబట్టారు.