ట్రంప్ కి పుతిన్ ఇచ్చిన బాల్ ని పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తాం:  సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ

వాస్తవం ప్రతినిధి: ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ బహుమతిగా ఫుట్ బాల్ ని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఫుట్ బాల్ ని కూడా పూర్తిస్థాయిలో తనిఖీలు చేస్తామని సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెన్సీ చెబుతోంది. ఇటీవల ట్రంప్‌-పుతిన్‌లు ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకిలో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన జాయింట్‌ ప్రెస్‌ కాన్పరెన్స్‌లో సిరియా అంశంలో ఉమ్మడి సహకారంపై ట్రంప్‌ మాట్లాడుతుండగా.. ఓ విలేకరి కల్పించుకొని ఒక వేళ ‘బంతి‌ రష్యా కోర్టులో ఉందా..?’ అని పుతిన్‌ను అడిగాడు. దీనికి పుతిన్‌ స్పందిస్తూ….. వాస్తవానికి మేము వరల్డ్‌ కప్‌ను విజయవంతంగా పూర్తి చేశాం అని ఇప్పుడే ట్రంప్‌ చెప్పారు అని అన్నారు. అనంతరం వేదిక పక్కకు వెళ్లి 2018 వరల్డ్‌ కప్‌ సాకర్‌ బాల్‌ ఒకటి తీసుకొచ్చి మిస్టర్‌ ప్రెసిడెంట్‌ ఈ బంతిని మీకు ఇస్తున్నాను. బాల్‌ ఇప్పుడు మీ కోర్టులో ఉంది అంటూ దానిని ట్రంప్‌కు అందజేశారు. అయితే ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడి భద్రతా వ్యవహారాలను చూసే సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెన్సీ స్పందిస్టూ…. అధ్యక్షుడికి వచ్చే ప్రతి బహుమతికి భద్రతా పరమైన తనిఖీలు నిర్వహిస్తామని తెలిపింది. 

అయితే ఈ ఘటనకు ఒక్కరోజు ముందు పుతిన్‌ ఇటువంటి బంతినే ఖతర్‌ రాజుకు అందజేశారు. 2022 ప్రపంచకప్‌కు ఖతర్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. 2026లో అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ప్రపంచకప్‌ను నిర్వహించనున్నాయి.