ట్రంప్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన రౌహనీ!

వాస్తవం ప్రతినిధి: ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహనీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పులితో ఆటలు వద్దంటూ ట్రంప్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా కొనసాగిస్తున్న విరుద్దమైన విధానాలకు స్వస్తి చెప్పాలని ఈ సందర్భంగా రౌహనీ పేర్కొన్నారు. ఇరానియన్ దౌత్యవేత్తల సమావేశంలో ఆదివారం ఆయన ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ‘ఇరాన్‌తో యుద్దం అంటే యుద్దాల తల్లితో పారాడమే. మాతో యుద్దం అంత సులువైనది కాదు. శాంతికి మారుపేరు ఇరాన్‌ అన్న విషయం అమెరికాకు తెలుసు. యుద్దానికి ప్రతీరూపం కూడా ఇరాన్‌ అనే విషయం ట్రంప్‌ తెలుసుకుంటే మంచిది’ అని రోహనీ పేర్కొన్నారు. 2015లో ఇరాన్‌ ప్రవేశపెట్టిన ఒప్పందం నుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అమెరికా ఇరాన్‌పై అంతర్జాతీయంగా ఆంక్షలు విధించి, రాజకీయంగా ఒత్తిడిని తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఇరాన్ అధ్యక్షుడు గట్టి వార్నింగ్ ఇచ్చారు.