క్రికెట్ ఆడితే పెళ్లి కాదని అన్నారు: మిథాలీ

వాస్తవం ప్రతినిధి:  క్రికెట్‌ ఆడితే.. పెళ్లి కాదని భారత మహిళల క్రికెట్ జట్టు సారధి మిథాలి రాజ్ ను ఏడిపించారట. ఇంతకీ మిథాలీని ఎవరు అలా ఏడిపించారో తెలుసా.. ఆమె తాతయ్య, నానమ్మలట. ఇటీవల ఓ వెబ్‌ షోలో పాల్గొన్న మిథాలీ తనకు సంబందించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మంచి డ్యాన్సర్‌ అవ్వాలన్నది అమ్మ కోరిక అయితే క్రికెటర్‌ కావాలన్నది నాన్న అభిలాష అని మిథాలీ చెప్పుకొచ్చిందది. ‘నన్ను మంచి డ్యాన్సర్‌ చేయాలని మా అమ్మకు ఉండేది. క్రికెట్ ఆడటం మొదలు పెట్టకముందు ఎప్పటి నుంచో నేను డ్యాన్స్‌ నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పట్లో నా ఫస్ట్‌ ఛాయిస్‌ డ్యాన్స్‌కే. డ్యాన్స్‌ చేస్తూ చాలా ఎంజాయ్‌ చేసేదాన్ని. కానీ, కొన్ని కారణాల వల్ల క్రికెట్‌ నా కెరీర్‌లో తప్పనిసరైంది. ఆ రోజుల్లో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం సవాలుతో కూడుకున్నదే. నేను క్రికెటర్‌ అవ్వాలని అనుకుంటున్నట్లు చెబితే మా తాతయ్య, నానమ్మ నమ్మలేదు. మా కుటుంబంలో ఎవరూ క్రీడాకారులు లేదు. మగవాళ్లతో కలిసి క్రికెట్‌ ఆడేందుకు మా తాతయ్య, నానమ్మలు అంగీకరించారు. ఎవరూ నిద్రలేవక ముందే నేను లేచి ప్రాక్టీస్‌కు వెళ్లేదాన్ని. తిరిగి సాయంత్రం వచ్చేదాన్ని. ముఖం అంతా జిడ్డుగా మారేది. అక్కడక్కడా పగుళ్లు కూడా వచ్చేవి. అవి చూసి మా తాతయ్య-నానమ్మలు నన్ను ఏడిపించేవారు. క్రికెట్‌ ఆడటానికి వెళ్లి ఇలా ముఖమంతా పగులకొట్టుకుని నిన్ను పెళ్లి చేసుకోడానికి ఎవరూ రారు అని ఆటపట్టించేవారు’ అని మిథాలీ చెప్పుకొచ్చింది.