ఆ గట్టున చంద్రబాబు ఈ గట్టున పవన్..

వాస్తవం ప్రతినిధి: ఉండవల్లిలో పంట భూములలో రైతులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహిస్తున్నారు..అయితే పవన్ సమావేశమైన ప్రాంతం పంట భూమి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి అతి సమీపంలో ఉండటం విశేషం.. కరకట్టకి ఆ గట్టుకి అటు వైపు నివాసంలో చంద్రబాబు…అదే కరకట్టకి ఇటువైపు పవన్ కళ్యాణ్…. సమావేశం జరుగుతూ ఉండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది..ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
ఏపీ రాజధాని అమరావతి కోసం అవసరానికి మించి భూసేకరణ జరుగుతోందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. భూసేకరణ చేస్తారనే విషయం ఎన్నికలకు ముందే తెలిసి ఉంటే… తాను మరోలా ఉండేవాడినని, టీడీపీకి మద్దతు ఇచ్చేవాడిని కాదని చెప్పారు. ఇకపై భూసేకరణ చేస్తే, ఎదురు తిరగాలంటూ రైతులకు పిలుపునిచ్చారు. భూసేకరణ జరిగితే తనకు చెప్పాలని, తాను కూడా వచ్చి మీతో పాటు ఆందోళనలో పాల్గొంటానని తెలిపారు. భూములను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తే… ప్రాణాలు ఇవ్వడానికి తానే ముందుంటానని చెప్పారు.

పంట భూములను బీడు భూములుగా చూపించడం దారుణమని పవన్ మండిపడ్డారు. అధికారులను, పోలీసులను వ్యతిరేక భావంతో చూడరాదని… వీరంతా ప్రభుత్వ నిర్ణయాలను అమలుచేసే వారు మాత్రమేనని చెప్పారు. చావులు, ఏడుపులతో రాజధాని వద్దని… రైతులను ఏడిపించినవారు నాశనమవుతారని అన్నారు. పంట భూములను లాక్కుంటే సర్వనాశనమైపోతారని శపించారు. భూదాహాలను ప్రభుత్వాలు తగ్గించుకోవాలని అన్నారు. కొంతమంది చేతుల్లోకి మాత్రమే సంపద వెళ్లడాన్ని జనసేన సహించదని అన్నారు. రాజ్యాంగం అందరికీ సమానమేనని… ఎవరూ ఎవరికీ బానిసలు కాదని చెప్పారు. రైతులు వాళ్ల భూముల్లోకి వెళ్లడానికి ఆధార్ కార్డులను చూపించాల్సిన పరిస్థితి రావడం దారుణమని అన్నారు.