రెండేళ్ళ పాటు క్రికెట్ కు దూరం కానున్న బంగ్లా బౌలర్

వాస్తవం ప్రతినిధి: క్రికెట్ కెరీర్ ని ప్రారంభించాక విరామం వచ్చింది అంటే వారెంత డిప్రెషన్ కి గురవుతా రో అందరికీ తెలుసు. కానీ బంగ్లా కు చెందిన ఒక బౌలర్ ఐపీఎల్ తో పాటు విదేశాల్లో కూడా జరిగే ఇతర టీ-20 లీగ్ లకు దూరం కానున్నాడు. అతడు ఎవరో కాదు బంగ్లాదేశ్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌. ఇది నిజమేనని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హాసన్ కూడా స్పష్టం చేశారు. ఇందుకు ప్రధాన కారణం ముస్తాఫిజుర్‌ వరుసగా గాయాల పాలవ్వడం. దీంతో అతడు బంగ్లాదేశ్‌ జాతీయ జట్టుకు ఎక్కువగా అందుబాటులో ఉండలేకపోతున్నాడు.

తాజాగా నజ్ముల్‌ హాసన్‌ మాట్లాడుతూ… ‘కనీసం రెండేళ్లపాటు విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు అందుబాటులో ఉండొద్దని ముస్తాఫిజుర్‌కు చెప్పాను. ఈ లీగ్‌లు ఆడటం వల్ల అతడు గాయాల పాలవుతున్నాడు. దీంతో బంగ్లాదేశ్‌ జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. దీన్ని మేము సహించలేం. విదేశీ లీగ్‌ల్లో ఆడి గాయాలపాలై స్వదేశానికి వచ్చి బోర్డు ఫిజియోల సమక్షంలో కోలుకుంటున్నాడు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ విదేశాలకు వెళ్లి లీగ్‌లు ఆడి వచ్చి గాయపడుతున్నాడు. 2015లో అరంగేట్రం చేసిన ముస్తాఫిజుర్‌ దేశం తరఫున ఇప్పటి వరకు కేవలం 10 టెస్టులు, 27 వన్డేలు, 24 టీ20లు మాత్రమే ఆడాడు. బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ విభాగంలో ముస్తాఫిజుర్‌ ఎంతో కీలకమైన ఆటగాడు. అలాంటివాడిని మేము కోల్పోవడం వల్ల జట్టుకు ఓటములు ఎక్కువవుతున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకోవల్సి వచ్చింది’ అని హాజన్‌ తెలిపారు.