పోలీస్ కానిస్టేబుల్ ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

వాస్తవం ప్రతినిధి: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గత నెలలో జవాన్ ఔరంగజేబ్‌ను టెర్రరిస్టులు అపహరించి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన మరువక ముందే జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లాలో ఒక పోలీసు కానిస్టేబుల్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది. కతువాలో ట్రైనింగ్‌లో ఉన్న పోలీసు కానిస్టేబుల్ ఇటీవలే సెలవు మీద తన సొంతూరికి వచ్చాడు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్‌ను ఉగ్రవాదులు నిన్న రాత్రి కిడ్నాప్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నేపధ్యంలో పోలీసు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది.  రంజాన్ పండుగను తన కుటుంబ సభ్యులతో జరుపుకోవడం కోసం గతనెల జూన్ లో జవాన్ ఔరంగజేబ్ తన సొంతూరుకు వెళుతున్న సమయంలో మార్గ మధ్యంలోనే అతడ్ని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటన మరువక ముందే ట్రైనింగ్ లో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం అక్కడ కలకలం రేగింది. గత కొన్నేళ్ల నుంచి దక్షిణ కశ్మీర్‌లో టెర్రర్ గ్రూపులు తమ కార్యకలాపాలను చురుకుగా కొనసాగిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. తరుచుగా ఉగ్రవాదులు పోలీసులపై దాడులు చేసి వారి వద్ద ఉన్న ఆయుధాలను అపహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.