నాటో దేశాలు హద్దు మీరితే సహించేది లేదు: పుతిన్

వాస్తవం ప్రతినిధి: ఉత్తర అట్లాంటిక్‌ దేశాల కూటమి (నాటో) హద్దు మీరితే సహించేది లేదని, దానికి దీటుగా జవాబిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించారు.  దేశంలోని విదేశీ రాయబారులతో గురువారం భేటీ అయిన ఆయన పై హెచ్చరిక చేసినట్లు తెలుస్తుంది. ఐరోపాలో శాంతి, సుస్థిరతలకు ప్రధానంగా దేశాల మధ్య సహకారం, పరస్పర విశ్వాసం నెలకొనటం అవసరమని, దానిని కాదని నాటో తమ సరిహద్దులను అతిక్రమించేందుకు యత్నిస్తే మాత్రం తగు రీతిలో వారికి బుద్ది చెబుతామని ఆయన స్పష్టం చేశారు. తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లే చర్యలు చేపడితే సహించేది లేదన్నారు. జార్జియా, ఉక్రెయిన్‌లను తమ కూటమిలో చేర్చుకునేందుకు ప్రయత్నించటం ద్వారా రష్యాను బలహీనపరచాలని చూస్తున్నారని, ఇటువంటి చర్యలకు తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. . మనం సానుకూల అజెండాతో సమన్వయంగా వ్యవహరిద్దామని ఆయన అన్నారు. ఈ దృష్టితోనే తాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో హెల్సింకీలో భేటీ అయ్యానని పుతిన్‌ వివరించారు.