తృణమూల్ లో చేరిన చందన్ మిత్ర

వాస్తవం ప్రతినిధి: ఇటీవల బీజేపీ పార్టీ కి రాజీనామా సమర్పించిన చందన్ మిత్ర ఈ రోజు తృణమూల్ కాంగ్రెస్ లో చేరినట్లు తెలుస్తుంది. మిత్ర తో పాటు కాంగ్రెస్ పార్టీకు చెందిన పలువురు నేతలు కూడా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరినట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో వీరంతా పార్టీ లో చేరినట్లు తెలుస్తుంది. మాజీ బీజేపీ నాయకుడు చందన్ మిత్ర, కాంగ్రెస్ నాయకులు సమర్ ముఖర్జీ, అబు తాహీర్, సబినా యాస్మిన్, అక్రుజ్‌మన్‌లు ఈ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరందరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మమతా బెనర్జీ. బీజేపీ విధి విధానాలు నచ్చక ఆ పార్టీ కి రాజీనామా చేసినట్లు చందన్ మిత్ర తెలిపిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ, అమిత్ షా ప్రవర్తనతో పార్టీలో సంతోషంగా ఉండలేకపోతున్నానని చందన్ ప్రకటించారు. 2016లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హుగ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన చందన్ మిత్ర.. డిపాజిట్లు కోల్పోయారు. జర్నలిస్టుగా కేరీర్ ప్రారంభించిన చందన్ మిత్ర.. ఢిల్లీ నుంచి వెలువడుతున్న పాయినీర్ న్యూస్ పేపర్‌కు ఎడిటర్‌గా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు.