చూపరులను తెగ ఆకట్టుకుంటున్న టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్!

వాస్తవం ప్రతినిధి:  ‘ది సమ్మిట్ క్రైసిస్’ పేరుతో టైమ్ మ్యాగజైన్ వెలువరించి కవర్‌ పేజ్ ఇప్పుడు చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ కవర్ పేజ్ పై ఏముంది అనేనా మీ అనుమానం. అది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కు సంబందించిన విషయం. ఆ కవర్ పేజ్ ను చూస్తే పరోక్షంగా ట్రంప్‌ విధానాన్నిఎత్తి చూపుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్ ముఖాలను మార్ఫింగ్ చేసి టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద ప్రచురించింది. అయితే ట్రంప్‌ కదలికను ప్రస్ఫుటించేలా దీన్ని డిజైన్‌ చేయడం విశేషం. అలాగే యానిమేటెడ్ వర్షన్‌ను కూడా ట్వీట్ చేసింది. దానిలో ట్రంప్‌ రష్యా అధ్యక్షుడిగా మారిపోతాడు. రష్యాతో సమావేశం కోసం ట్రంప్‌ తొందరపడటాన్ని ఎద్దేవా చేస్తూ మార్ఫింగ్ ఫొటోలను ముందుకు తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. ‘పుతిన్‌తో ట్రంప్‌ సమావేశం కావాలని కోరుకుంటున్నారు. దానికోసం అడుక్కోవడం కంటే ఎక్కువే చేశారు’ అని కవర్‌ స్టోరీకి టైమ్‌ హెడ్‌లైన్ పెట్టింది. రష్యా, అమెరికా మధ్య సంబంధాలు చెడిపోవడానికి కారణం అమెరికన్లే అని ట్రంప్‌ ఆరోపించిన నేపథ్యంలో టైమ్ ఈ కవర్‌ పేజ్‌ను ప్రచురించినట్లు తెలుస్తుంది.