కోహ్లీ రికార్డ్ కు ఎసరు పెట్టిన పాక్ క్రికెటర్

వాస్తవం ప్రతినిధి: భారత పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్ద్ కు పాక్ క్రికెటర్ ఎసరు పెట్టనున్నాడు. పాకిస్థాన్‌- జింబాబ్వే మధ్య ప్రస్తుతం 5 వన్డేల సిరీస్‌ జరుగుతోంది. శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో పాక్ క్రికెటర్ ఫకర్‌ జమాన్‌ ఆతిథ్య జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 156 బంతుల్లో 210 పరుగులు చేసి పాక్‌ తరఫున ద్విశతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుల కెక్కాడు. తాజాగా అతడు విరాట్‌ కోహ్లీ రికార్డుపై కన్నేశాడు. అదేంటంటే.. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించడం. ఇప్పటి వరకు 17 వన్డే మ్యాచ్‌లాడిన ఫకర్‌ 17 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 980 పరుగులు సాధించాడు. మరో 20 పరుగులు చేస్తే అతడు వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరతాడు. విరాట్‌ కోహ్లీ 24 ఇన్నింగ్స్‌ల ద్వారా 2008లో వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరగా.. వెస్టిండీస్‌ ఆటగాడు వివ్‌ రిచర్డ్స్‌ 21ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా పాక్‌-జింబాబ్వే మధ్య ఆదివారం చివరి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో 20 పరుగులు చేస్తే చాలు ఫకర్‌ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు అన్నమాట.  అంతేకాకుండా కేవలం 18 ఇన్నింగ్స్‌ల ద్వారానే ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా కూడా అతడు నిలుస్తాడు. ఐదు వన్డేల సిరీస్‌ను పాక్‌ ఇప్పటికే 4-0తో కైవసం చేసుకుంది.